ఉయ్యాలవాడ విగ్రహం గర్వకారణం
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి
కర్నూలు జిల్లా – బ్రిటిష్ వారితో పోరాడిన తొలి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జ్ఞాపకార్థంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం రాయలసీమ ప్రాంత ప్రజలందరూ మొత్తం గర్వపడే విషయమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు,శాసనసభ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.
ఓర్వకల్లు ఎయిర్ పోర్టు పరిధిలో ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను మంత్రి ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయం పరిధిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మాజీ సీఎం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల ఏర్పాటుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టి పూర్తి చేసిందన్నారు.
భారతదేశంలోనే బ్రిటిష్ వారితో పోరాడిన మొట్ట మొదటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారన్నారు. రాయలసీమ ప్రాంతం ముందే కరువు ప్రాంతం అయినప్పటికీ రైతుల నుండి అధిక పన్ను వసూలు చేస్తున్న బ్రిటిష్ వారితో ఇది అన్యాయమని చెప్పి కొన్ని సంవత్సరాలు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో కర్నూలు విమానశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు, ఇందుకు సంబంధించిన అనుమతుల కొరకు చట్టసభలో ఆమోదించిన ప్రతిపాదనలను ఇప్పటికే భారత ప్రభుత్వం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపడం జరిగిందన్నారు.