సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
విశాఖపట్నం – విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ఒరిగింది ఏమీ లేదన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. కేంద్రం ప్రకటించిన రూ.11వేల కోట్లు ప్యాకేజి ని చూసి తొలుత ప్లాంట్ ను నిలబెట్టడానికి అనుకున్నామని అన్నారు. ఇది తమ ఘనత అంటూ సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. తీరా చూస్తే ప్లాంట్ ను రక్షించడానికి ఉద్యోగుల కోసమో కాకుండా బ్యాంకుల అప్పుల కోసం మాత్రమే అని అర్ధం అవుతుందని అన్నారు. ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే సొంత గనులివ్వాలని, సెయిల్ లో విలీనం చేయాలన్నారు. గతంలో మోడీ ప్రకటన చేసిన ప్రైవేటీకరణ పూర్తిగా ఆపేయాలని రాఘవులు డిమాండ్ చేశారు.
శనివారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిపిఎం విశాఖపట్నం జిల్లా ప్లీనరీకి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు బీవీ రాఘవులు. స్టీల్ ప్లాంట్ శిబిరంలో కార్మికుల ఆందోళనకు మద్దతు ప్రకటించడమే కాకుండా భవిష్యత్ పోరాటాలకు సిపిఎం మద్దతుగా నిలుస్తుందన్నారు. ప్యాకేజి వల్ల కార్మికులు ప్లాంట్ కి ఒనగూరేదేమి లేదన్నారు. అలాగే ఇనుప ఖనిజాన్ని స్టీల్ ప్లాంట్ కివ్వకుండా మిట్టల్ కి గ్యారెంటీ ఇవ్వడాన్ని రాఘవులు తప్పుపట్టారు. 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి రావాలంటే రూ.9 వేల కోట్లు తక్షణమే ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ అదనంగా కోకోవెన్ బ్లాస్ట్ ఫర్నీస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపునకు సన్నాహాలు చేస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న అక్రమ ఒప్పందం వల్ల లక్ష కోట్ల రూపాయల మేర విద్యుత్ భారాలు ఏపీ ప్రజలపై పడనున్నాయని , దీన్ని రద్దు చేయాలంటే ప్రభుత్వం పై జరిమానాలు వేస్తారని రద్దు సాధ్యం కాదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఆవిర్భావ సభలో చేగువేరా కమ్యూనిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు విచిత్రం గా ఉన్నాయన్నారు. చేగువేరా గొప్ప విప్లవకారుడని అందరికీ తెలుసన్నారు. మూడు భాషలను రాష్ట్రాలపై రుద్దాలని కేంద్రం చూడడాన్ని , బెదిరింపులకు దిగడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బివి.రాఘవులు స్పష్టం చేశారు. త్రిభాష అమలు చేస్తేనే నిధులు ఇస్తామని లింకు కూడా సరైంది కాదన్నారు. కేంద్రం తెచ్చే డీలిమిటేషన్ విధానం పై రాఘవులు మాట్లాడుతూ … రాష్ట్రాల మధ్య సమతుల్యత దెబ్బ తినకూడదన్నారు.