క్యారకల్ – ఐకామ్ భాగస్వామ్యం
హైదరాబాద్ – దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) గ్రూప్ సంస్థ ఐ కామ్ ను సోమవారం ప్రారంభించింది. ఐ కామ్ సమీకృత ఇంజనీరింగ్ విభాగం ఆవరణలో ఈ ఆయుధ తయారీ కేంద్రాన్ని ఐ కామ్ టెలీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు, క్యారకల్ సిఈఓ హమద్ అల్ అమెరి సంయుక్తంగా ప్రారంభించారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఇక్కడ తయారయ్యే ఆయుధాలు భారత సాయుధ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ( సి ఏ పీ ఎఫ్ ఎస్ ), సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు, ఎస్ పీ జీ వంటి సంస్థల కీలక అవసరాలను తీరుస్తాయి.
అలాగే క్యారకల్ సంస్థ ప్రపంచంలోని వివిధ దేశాలకు ఆయుధాల్ని ఎగుమతి చేసేందుకు హైదరాబాద్ లోని ఆయుధ తయారీ కేంద్రం ఉపయోగ పడుతుంది. యూఏఈ సంస్థ భారత దేశానికి తొలిసారి చిన్న ఆయుధాల తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. క్యారకల్, హైదరాబాద్ లో ఉన్న ఐ కామ్ కేంద్రంలో మిషన్-ప్రూవెన్ కార్ 816 క్లోజ్-క్వార్టర్స్ బాటిల్ రైఫిల్, లక్ష్యాన్ని చేధించగలిగే కార్ 817 అసాల్ట్ రైఫిల్, తేలికపాటి సి ఎస్ ఆర్ 338, 308 బోల్ట్-యాక్షన్ స్నిపర్ రైఫిల్స్, లక్ష్యాన్ని ఛేదించే అత్యంత ఖచ్చితమైన సి ఎస్ ఆర్ 50 బోల్ట్-యాక్షన్ యాంటీ-మెటీరియల్ స్నిపర్ రైఫిల్, ఆధునిక సి ఎం పీ 9 సబ్మెషిన్ గన్, పలు రకాలుగా ఉపయోగపడే క్యారకల్ ఈ ఎఫ్, క్యారకల్ ఎఫ్ జెన్ 2 కాంబాక్ట్ పిస్టల్స్ తయారు చేస్తారు.