అన్న క్యాంటీన్ కు సెల్ కాన్ ఎండీ విరాళం
రూ. 26.25 లక్షల చెక్కు సీఎం బాబుకు అందజేత
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలిని తీరుస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు దాతలు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు స్పందించారు ప్రముఖ సెల్ ఫోన్ ల నిర్వహణ సంస్థ సెల్ కాన్ కంపెనీ. ఈ మేరకు సదరు కంపెనీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుస్వామి నాయుడు కీలక ప్రకటన చేశారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు గాను తనకు తోచిన మేరకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకుని మొత్తం 100 అన్న క్యాంటీన్లలో భోజనానికి గాను రూ. 26.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆరోజుకు అవసరమయ్యే ఖర్చును తాను భరిస్తున్నట్లు తెలిపారు గురుస్వామి నాయుడు.
మొత్తం విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సచివాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా సెల్ కాన్ సీఎండీ గురు స్వామి నాయుడును ప్రశంసలతో ముంచెత్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్. గురుస్వామి నాయుడును స్పూర్తిగా తీసుకుని మరికొందరు వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఔత్సాహికులు తమ వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు.