ఏపీ పర్యాటక రంగానికి రూ. 113.75 కోట్లు
విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
అమరావతి : కేంద్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఏపీ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అఖండ గోదావరి, గండికోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కి (Special Assistance to States for Capital Investment) ద్వారా రూ.113.751 కోట్ల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
నిధుల విడుదలకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సాస్కి స్కీం 2024-25 ద్వారా విడుదల చేసిన నిధులతో ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం వచ్చిందని పేర్కొన్నారు. ఈ నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఆచరణలో చేసి చూపిస్తామని పేర్కొన్నారు. కేంద్రం సాస్కి స్కీం ద్వారా తొలి విడతగా 66 శాతం నిధులు మంజూరు చేసిందని, ఆ నిధుల్లో 75 శాతం వినియోగించాక మిగతా 34 శాతం విడుదల చేస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.
కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకర్షించవచ్చని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదిక( డీపీఆర్) లను కేంద్రానికి సమర్పించామని మంత్రి గుర్తు చేశారు.