చాగంటి ప్రవచనాల్లో ఘనాపాఠి
శని..ఆదివారాల్లో మాత్రమే ప్రవచనాలు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏరికోరి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావుకు అరుదైన పదవిని కట్టబెట్టింది. ఆయనకు ఏకంగా కేబినెట్ మంత్రి హోదా కలిగిన పోస్టును కేటాయించింది. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎంపిక చేసింది.
చాగంటి కోటేశ్వర్ రావు గురించి కొన్ని ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. ఇవాళ సినిమా హీరోలలో అగ్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు . గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం.
అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో , కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. సునాయాసంగా బయట పడ్డారు. చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణిగా ఉన్నారు.
ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటి ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు.
ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. ఇదీ ఆయన ప్రత్యేకత. విధులు నిర్వహించిన తర్వాత అక్కడికి వెళుతుంటారు.