Saturday, April 19, 2025
HomeDEVOTIONALవైభ‌వోపేతం చ‌క్ర‌ధారుడి చ‌క్ర‌స్నానం

వైభ‌వోపేతం చ‌క్ర‌ధారుడి చ‌క్ర‌స్నానం

ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి ఉత్స‌వాలు

తిరుప‌తి – శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం నాటితో ముగిశాయి. ఇవాళ ఉద‌యం చక్ర స్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

అంతకు ముందు ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామి, అమ్మ వార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా చేప‌ట్టారు. అనంత‌రం ఉద‌యం 9.45 గంట‌ల‌కు చ‌క్ర‌స్నానం ఘ‌నంగా జ‌రిగింది.

ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యా హవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్య పాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం చేప‌ట్టారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్య ప్రబంధం లోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టిటిడి వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మ వార్లకు అలంకరించారు.

ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాప విముక్తులై, ధన ధాన్య సమృద్ధితో తులతూగుతారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments