దమ్ముంటే నా మీద పోటీ చేయ్
కేసీఆర్ కు సవాల్ విసిరిన వంశీ చందర్
మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ చేపట్టిన ఛలో కాళేశ్వరంకు పోటీగా తాము పాలమూరు – రంగారెడ్డి ఛలో యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు.
ఈ సందర్బంగా ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దమ్ము, ధైర్యం ఉంటే తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. ఈ మేరకు తాను మాజీ సీఎంకు లేఖ రాసినట్లు చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాను ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తనను పార్టీ పరంగా అందలం ఎక్కించిన ఘనత ఈ జిల్లా వాసులదని , దత్తత తీసుకుంటానని చెప్పి దగా చేశాడంటూ ఆరోపించారు వంశీ చందర్ రెడ్డి. గత ప్రభుత్వం ఖాళీ ఖజానా తమకు అప్పగించిందని, దానిని పూర్తి చేయాలంటే తలకు మించిన భారంగా మారిందన్నారు ఎంపీ అభ్యర్థి.
తాను చేసిన సవాల్ కు కేసీఆర్ స్వీకరించాలని లేక పోతే తాను ఓడి పోయినట్టు ఒప్పుకోవాలని సవాల్ చేశారు.