30న బీజేపీలో చేరనున్న చంపై సోరేన్
ముహూర్తం ఖరారు చేసిన మాజీ సీఎం
ఢిల్లీ – జార్ఖండ్ రాష్ట్రంలో అత్యంత పేరు పొందిన నాయకుడిగా గుర్తింపు పొందిన జేఎంఎం నేత చంపై సోరేన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ జైలు పాలైన సమయంలో చంపై సోరేన్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇదే సమయంలో ఆయన కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీని, ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై సంచలన ఆరోపణలు చేశారు.
అనంతరం ఊహించని రీతిలో హేమంత్ సోరేన్ కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏమైందో ఏమో కానీ హేమంత్ సోరేన్ , చంపై సోరేన్ మధ్య దూరం పెరిగింది. చివరకు తనకు తెలియకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించారని, తనకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు చంపై సోరేన్.
ఆ తర్వాత పలుమార్లు ఢిల్లీకి వచ్చారు. త్వరలో జార్ఖండ్ లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ట్రబుల్ షూటర్ అమిత్ షా చక్రం తిప్పారు. చంపై సోరేన్ ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు చంపై షాను కలుసుకున్నారు. బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆగస్టు 30న ఆయన కమల జెండాను కప్పుకోనున్నారు.