దుబాయ్ వేదికగా నువ్వా నేనా
దుబాయ్ – ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇవాళ జరిగే సెమీస్ నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది. బలమైన పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను ఓడించింది రోహిత్ సేన. ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. 2023లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు ప్రతీకారం తీర్చు కోవాలని అనుకుంటోంది.
ఈ కీలక మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. బలమైన దాయాది పాకిస్తాన్ ను ఇదే వేదికపై చుక్కలు చూపించింది భారత జట్టు.
అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ బలంగా ఉంది టీమిండియా. స్టార్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పాలిట శాపంగా మారాడు. ఎక్కడా తొట్రుపాటుకు లోనుకుండా సూపర్ సెంచరీతో భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే సమయంలో వరుణ్ చక్రవర్తి కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.