అంగ రంగ వైభోగం చండీ యాగం
శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘనం
తిరుపతి – తిరుపతి లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా భావించే శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం( చండీ యాగం) ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు చండీ యాగం వైభవంగా జరుగనుంది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టారు.
కాగా, గృహస్తులు రూ.500/- టికెట్‌తో ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు, పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను కల్పించారు.