కేంద్ర మంత్రికి తీరక లేక పోతే ఎలా..?
రామ్మోహనాయుడుపై సీఎం సీరియస్
అమరావతి – ఏపీ సీఎం, టీడీపీ బాస్ నారా చంద్రబాబు నాయుడు చురకలు అంటించారు. ఒక రకంగా సీరియస్ అయ్యారని చెప్పక తప్పదు. 70 ఏళ్లకు పైబడినా ఇంకా యువకులతో పోటీ పడుతున్నారు సీఎం. మొన్నటికి మొన్న వరదల్లో సైతం తానే ముందుండి పాలనా పరంగా నడిపించారు. సమీక్షలు, నిర్ణయాలతో హోరెత్తిస్తున్నారు.
ఈ తరుణంలో తాజాగా జరిగిన కార్యక్రమంలో కీలకమైన ఎంపీగా, కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులైనా సరే ఎంపీలన్న సంగతి మరిచి పోవద్దని హితవు పలికారు.
ఇదిలా ఉండగా వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం, కృష్ణా, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు.
ఇచ్ఛాపురం సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కనపడక పోవడంతో ‘కలెక్టర్ ని ఉద్దేశించి అడిగారు… మీ మంత్రి, ఎంపీకి సమాచారం ఇవ్వలేదా?’ అని సీఎం. దీనికి సమాధానం ఇచ్చారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ .
సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతో నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎంత బిజీగా ఉన్నా ప్రజలకు దూరం కాకూడదు కదా! వర్చువల్‌గా కూడా జాయిన్ కావచ్చు అని స్పష్టం చేశారు.
మంత్రులైనా ఎంపీలేననే విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రజలతో మమేకం కావాలి. దీని నుంచి తప్పించుకోకూడదు అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడికి ముఖ్యమంత్రి చురక వేశారు.