దివ్యాంగులకు నెలకు 6 వేల పెన్షన్
అధికారంలోకి వస్తే అమలు చేస్తా
సత్తెనపల్లి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సత్తెనపల్లిలో దివ్యాంగులు పెద్ద ఎత్తున బాబును కలుసుకున్నారు. తమ న్యాయ పరమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
వారి సమస్యల గురించి తనకు తెలుసన్నారు. వారి కోరిక పై టీడీపీ, జనసేన, బీజపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల చొప్పున పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దివ్యాంగులు గత కొన్నేళ్లుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. మానవతా దృక్ఫథంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశమేనని గుర్తు చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి యేటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశామన్నారు. దివ్యాంగుల కోసం టీడీపీ అమలుచేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు.