కొందరు ఇవ్వక పోవడంపై సీఎం సీరియస్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. శాఖల వారీగా సమీక్ష చేపట్టిన ఆయన మంత్రుల పనితీరుపై ఆరా తీశారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. బాధ్యత కలిగిన మీరే నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలలైనా ఇప్పటి వరకు ప్రోగ్రెస్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదంటూ కొందరు మంత్రులపై మండిపడ్డారు. ఇలా చేస్తే ఊరుకోనంటూ సుతిమెత్తగా హెచ్చరించారు.
కేబినెట్ లో కొలువు తీరాక బాధ్యతతో వ్యవహరించాలని, తమకు కేటాయించిన శాఖలపై ఇంకా పట్టు పెంచుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు. వ్యవస్థలు ఇప్పటికే పని చేయడం లేదని, మంత్రులు వాటిని సక్రమంగా పని చేయించేలా, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఇవేవీ లేకుండా తాము ఊరికే మంత్రులం అని అనిపించుకునేందుకు మాత్రమే ఉన్నామంటే కుదరదని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇక నుంచి సహించేది లేదన్నారు. వెంటనే తమ తమ శాఖలకు చెందిన మంత్రులు ఎవరైతే ఇవ్వలేదో వారు రెండు మూడు రోజుల్లో తనకు అందజేయాలని ఆదేశించారు.