జగన్ కు బాబు బహిరంగ సవాల్
రాష్ట్ర ప్రగతిపై చర్చకు సిద్దం
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే రాష్ట్ర ప్రగతిపై చర్చకు సిద్దం కావాలని అన్నారు. తాను వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ ఆరోపించారు. సామాజిక న్యాయానికి శిలువ వేసిన చరిత్ర నీది కాదా అంటూ జగన్ పై మండిపడ్డారు . బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి….విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.
అన్నీ మరిచి పోయి ప్రస్తుతం నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందన్నారు. ఇంకా 50 రోజులు మాత్రమే ఉందని, రెక్కలు ఊడి పోయిన ఫ్యాన్ ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదు…అభివృద్ది పాలన ఎవరిదో….విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామన్నారు. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం…నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా….దేని మీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ అని సవాల్ విసిరారు.