జేపీ నిర్ణయం బాబు స్వాగతం
అభినందించిన టీడీపీ చీఫ్
అమరావతి – భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయేకు తాను మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందుకు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారయణ్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ప్రగతి శీల , ప్రజాస్వామ్య ఏపీ కోసం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జేపీ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
రాచరిక పాలన సాగుతోందని, జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని తిరిగి పునర్ నిర్మించేందుకు గాను టీడీపీ కూటమికి మద్దతు తెలిపేందుకు , ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు గాను సమాన ఆలోచనలు కలిగిన వ్యక్తులు, సంస్థలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో తమ కూటమికే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని జోష్యం చెప్పారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.