NEWSANDHRA PRADESH

అర్చ‌కుల‌పై దాడి దారుణం

Share it with your family & friends

నారా చంద్ర‌బాబు ఆవేద‌న

అమ‌రావ‌తి – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో రోజు రోజుకు ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. అర్చ‌కుల‌పై వైసీపీకి చెందిన వారు దాడుల‌కు దిగ‌డంపై మండిప‌డ్డారు. ఇది పూర్తిగా స‌మంజసం కానే కాద‌ని పేర్కొన్నారు. ఈ దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ పూజించే హ‌క్కు ఉంద‌న్న విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని సూచించారు.

హిందూ సంప్ర‌దాయంలో అర్చ‌కుడికి గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానం ఉంద‌ని తెలిపారు చంద్ర‌బాబు నాయుడు. దేవుడికి భ‌క్తుడికి మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌గా భ‌క్తులు భావిస్తార‌ని, ఆయ‌న కాళ్ల‌కు మొక్కుతార‌ని, ఆశీర్వాదం తీసుకుంటార‌ని ఈ విష‌యం కూడా తెలియ‌కుండా దాడి ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు టీడీపీ చీఫ్‌.

అటువంటి పూజారుల‌ను భ‌క్తుల సమ‌క్షంలోనే దాడులు చేయ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని పిలుపునిచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు. కాకినాడ నగరం దేవాలయం వీధిలోని శివాలయంలో అర్చకుల పై వైసీపీ నేత చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు.

వైసీపీ నేతల అధికార మదానికి, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపుకు ఇది నిదర్శనమ‌ని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్ళు వరుసగా దేవాలయాల్లోని దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయ‌ని గుర్తు చేశారు. ఒక్క కేసులోనూ నిందితుల పై చర్యలు తీసుకోలేద‌ని ఆరోపించారు.