ఓటర్ పై ఎమ్మెల్యే దాడి దారుణం
చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాచరిక పాలనకు పరాకాష్ట గుంటూరు జిల్లా తెనాలి శాసన సభ నియోజకవర్గ ఎమ్మెల్యే శివకుమార్ ఓటర్ పై దాడి చేయడం అని పేర్కొన్నారు. ఇది పూర్తిగా గర్హనీయమని అన్నారు.
సోమవారం పోలింగ్ సందర్బంగా చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. అధికారం ఉంది కదా అని ఎమ్మెల్యే ఇలా నిస్సిగ్గుగా అందరూ చూస్తూ ఉండగానే దాడికి దిగడం దారుణమని అన్నారు చంద్రబాబు నాయుడు.
వెంటనే తెనాలి వైసీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, ఇక నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, సామాన్యులకే భద్రత లేనప్పుడు ఇక ఉండీ ఏం లాభమని అన్నారు.
న్యాయ విచారణ జరిపించి శివకుమార్ అభ్యర్థిత్వాన్ని తొలగించాలని కోరారు ఏపీ టీడీపీ చీఫ్. ఇదిలా ఉండగా ఫ్రస్ట్రేషన్ కు గురై ఓటర్లపై దాడి చేయడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.