ఏపీలో పోలీసులకు రక్షణ కరువు
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ ప్రారంభమైన పోలింగ్ సందర్బంగా భారీ ఎత్తున దొంగ ఓట్లు పోలయ్యాయని , అధికార పార్టీ పవర్ ను అడ్డం పెట్టుకుని దాడులకు తెగ పడ్డాయని ఆరోపించారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం… తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి పై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా పెంచి పోషించిన రౌడీ మూకలు…ఈరోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలారా… ఈ కుట్రను మీరే తిప్పికొట్టాలి… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిర్భయంగా తరలి వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. . అత్యధిక ఓటు శాతంతో వైసీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలని కోరారు.