వాలంటీర్లకు చంద్రబాబు భరోసా
ఉద్యోగ భద్రత కల్పిస్తానని ప్రకటన
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థపై గత కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. వారంతా వైసీపీ కార్యకర్తలంటూ ఆరోపించారు. ఇదే సమయంలో వీరిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దంటూ ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఏ ఒక్క వాలంటీరు విధుల్లో పాల్గొన కూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. తాము వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. ఇదే సమయంలో వారికి తీపి కబురు చెప్పారు.
రాష్ట్రంలో పని చేస్తున్న వాలంటీర్లు నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు. మీ భవిష్యత్తుకు తాను గ్యారెంటీ ఇస్తున్నానని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. మీకు రూ. 30 వేలు వేతనం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. కానీ వైసీపీకి వత్తాసు పలికితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.