సీఎం నారా చంద్రబాబు నాయుడు
గన్నవరం: ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్‌ఎఫ్ మొదట గుర్తొస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జపాన్, నేపాల్, తుర్కియేలో ప్రకృతి విపత్తులు వచ్చినపుడు సేవలు అందించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలను ఎన్డీఆర్‌ఎఫ్ పరిష్కరించిందని చెప్పారు.
5 రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాం. ఎన్డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్, ఎన్‌ఐడీఎం ప్రాంగణాలకు 50ఎకరాల భూమి కేటాయించాం. వీటిని పూర్తిచేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
దేశంలో సమస్యల పరిష్కారానికి అమిత్‌షా పట్టుదలతో కృషి చేస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడటం సహా చాలా విషయాల్లో ఆయన వినూత్నంగా ఆలోచిస్తారు. కొన్నిసార్లు అమిత్‌షా పనితీరు చూస్తే నాకు అసూయ కలుగుతుంది. ఏపీ పునర్నిర్మాణంలో వినూత్నంగా ముందుకెళ్లాలని అమిత్‌షా సూచించారు. ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం.
ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ స్థితి నుంచి బయటపడింది. ఏపీ ఇంకా కోలుకోలేదు. రాజధాని అమరావతికి కేంద్రం నుంచి రూ.15వేల కోట్లు ఇచ్చారు.. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.
విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారు. ఇటీవల విశాఖ రైల్వేజోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలి. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయి. కేంద్రం మద్దతుతో ఏప్రిల్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం అని చంద్రబాబు తెలిపారు.