విపక్ష నేతలపై రాళ్ల దాడి
ఏపీలో ఘటనలు కలకలం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే విజయవాడ వేదికగా మేమంతా సిద్దం పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దీంతో ఆయన నుదుటికి బలమైన గాయం అయ్యింది. ఆ వెంటనే సీఎంను హుటా హుటిన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జగన్ రెడ్డికి కుట్లు వేశారు. రెస్ట్ తీసుకున్నాక తిరిగి ప్రచారం చేపట్టారు.
ఇదిలా ఉండగా ఈ ఘటన మరిచి పోక ముందే మరో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గాజువాకలో చేపట్టిన ప్రజా గళం సభలో ఉన్నట్టుండి గుర్తు తెలియని ఆగంతకులు రాళ్లు విసిరారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన నుంచి తప్పించుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పిందని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. కావాలని తమ నాయకుడిపై రాళ్లు వేయిస్తున్నారంటూ ఆరోపించారు.
ఇది పక్కన పెడితే టీడీపీ కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై కూడా రాయి దాడి జరిగింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి వారాహి విజయ యాత్ర సభలో చోటు చేసుకుంది. ఆ రాయి తలకు తగలక పోవడంతో పెను ప్రమాదం తప్పిందని జనసేన శ్రేణులు పేర్కొన్నాయి. మొత్తంగా ఏపీలో చోటు చేసుకున్న రాళ్ల దాడులపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందనే దానిపై విమర్శలు ఉన్నాయి.