అప్పటి సీఎంను కాను తోలు తీస్తా
మంగళగిరి: అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెదేపా అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన మంగళగిరిలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు.
‘‘రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగు దేశం పార్టీ. నేటి తరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు తెదేపాలోనే ఉన్నాయి. రాజకీయ కార్యకర్తల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేందుకు అనునిత్యం పని చేస్తున్నాం. వారి సంక్షేమం కోసం ముందుకెళ్లాం. రాజకీయ కక్షలకు బలైన సంఘటనలు చాలా చూశాం. అనేక కారణాలతో కార్యకర్తలు చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం’’
తెలుగు జాతికి గుర్తింపు తెదేపాతోనే వచ్చిందన్నారు నారా చంద్రబాబు నాయుడు . ‘తెదేపా పనైపోయిందన్న వాళ్ల పనైపోయింది. పార్టీయే శాశ్వతం. తెదేపాకు ముందు.. ఆ తర్వాత అన్నట్లు తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. కార్యకర్తల మనోభావాలు గౌరవించే పార్టీ తెదేపా. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా పెట్టిన పార్టీ ఇది. జాతీయ స్థాయిలో తెదేపా పోషించిన కీలక పాత్రలు మరే పార్టీకి సాధ్యం కాలేదు’’ అని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.