ఏపీలో దళితులకు భద్రత కరువు
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
చిత్తూరు జిల్లా – ఏపీలో దళితులకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేలకు భద్రత , గౌరవం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ఈసీ ఆఫీసులో డేటా చోరీపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
వైసీపీ పెత్తందారుల ముందు దళితుల ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లిందని వాపోయారు చంద్రబాబు నాయుడు. దళిత ఎమ్మెల్యేలకే ట్రాన్స్ ఫర్లు..నోరెత్తితే సీట్లు రద్దు చేయడం ఎంత వరకు సబబు ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే జె బ్రాండ్స్ తరిమేసి మద్యం ధరలు నియంత్రిస్తామని ప్రకటించారు.
జగన్ కు పులివెందుల లోనే దిక్కులేదని, కుప్పంలో వేలు పెడతాడా అని నిప్పులు చెరిగారు. పులివెందులలోనే జగన్ ఫ్యూజ్ కాలి పోయిందన్నారు. వైసీపీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు ముక్కలవటం ఖాయమని జోష్యం చెప్పారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిని, అవినీతికి పాల్పడే వారిని హెచ్చరిస్తున్నా..ఇక రెండు నెలలే మీ బాగోతమని అన్నారు. తర్వాత మీ పరిస్ధితి ఏంటో ఆలోచించుకోండన్నారు.