2014 నాటి సీఎంను కాను – చంద్రబాబు
తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదు
అమరావతి – ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను 1995 సీఎంనే కానీ 2014 లా కాదన్నారు సీఎం. ఈసారి కచ్చితంగా రాజకీయ పరిపాలనే చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో తప్పుచేసిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
కేడర్ నుంచి వస్తున్న విమర్శలను అర్థం చేసుకోగలనని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి సాగించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నట్లు చెప్పారు.
రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పు భారం మోస్తున్నామనేది గ్రహించాలని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ విష వలయం నుంచి బయట పడేందుకు కొంత సమయం అవసరమని స్పష్టం చేశారు.
పార్టీ పరంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కూటమికి చెందిన నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు సీఎం. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు.