తెలుగు జాతికి స్ఫూర్తి ఎన్టీఆర్
నివాళులు అర్పించిన చంద్రబాబు
అమరావతి – ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరికీ స్పూర్తి దాయకంగా నిలిచిన గొప్ప నాయకుడు దివంగత ఏపీ సీఎం నందమూరి తారక రామారావు అని కొనియాడారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. మే 28న ఆయన జయంతి. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. తనతో కలిసి ఉన్న అరుదైన ఫోటోను పంచుకున్నారు మాజీ సీఎం.
తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నలు దిశలా చాటారని పేర్కొన్నారు. తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి…అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని కోరారు.
క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్…తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని అన్నారు.
. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని అన్నారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారన్నారు.