ప్రజలను ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ
పెద్ద ఎత్తున సాయం చేశామన్న చంద్రబాబు
అమరావతి – ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించామని తెలిపారు.
విజయవాడ వరదల సమయంలో 10 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నే సచివాలయంగా మార్చుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి బాధితులకు సాయం చేశామని చెప్పారు.
ఇప్పుడు నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సాయం చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డామని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.
విజయవాడ నగరంలో వారం పది రోజులు వరదలో చిక్కుకుని ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం, పై అంతస్తుల్లో ఉన్న వారికి రూ.10 వేలు ఆర్ధిక సాయం ఇస్తామన్నారు.
రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరదలకు ఇల్లు మునిగి ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించారు సీఎం.
కిరాణా షాపులు, చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి రూ. 25 వేలు, ఎంఎస్ ఎంఈ లకు, వ్యాపార సంస్థ స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ. 3 వేలు, ఆటోలకు రూ. 10 వేలు అందిస్తామన్నారు. అలాగే దెబ్బతిన్న ధాన్యం, ప్రత్తి, చెరకు, వేరుసెనగ పంటలకు హెక్టారుకు రూ. 25 వేలు, అరటి, పసుపు వంటి ఉద్యానవన పంటలకు హెక్టార్ కు రూ. 35 వేలు సాయం చేస్తామన్నారు.
రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాలలో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నామని తెలిపారు సీఎం.
బ్యాంకులు, ఇన్ స్యూరెన్స్ ఏజెన్సీల ద్వారా కూడా మంచి సాయం అందేలా చేస్తున్నామని తెలిపారు.. మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువుల కోల్పోయిన రైతులకు కూడా పరిహారం అందిస్తున్నామని చెప్పారు. వరద సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటించామన్నారు.