పొత్తు కోసం ఢిల్లీకి పయనం
మంతనాలు జరుపుతున్న బాబు
అమరావతి – ఏపీలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలని, జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు ఇప్పటి దాకా. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో కీలక నిందితుడంటూ ఏపీ సీఐడీ పోలీస్ కేసు పెట్టింది. ఇదే కాదు మరో ఎనిమిది కేసులు కూడా జోడించింది. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఊరట నిచ్చేలా తీర్పు చెప్పింది కోర్టు.
ఇది పక్కన పెడితే ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఖరారు చేశారు. ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు. మరో వైపు గతంలో బీజేపీతో జత కట్టారు. ఆ తర్వాత దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కానీ అక్కడా ఉండలేక పోయారు. ప్రస్తుతం మళ్లీ చంద్రబాబు మోదీతో , అమిత్ షాతో దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశారు.
ఆయన ఇటీవల అయోధ్యలో శ్రీరాముడి మందిరం పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి విధిగా హాజరయ్యారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లే ముందు పార్టీకి చెందిన ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు.