అచ్యుతాపురం ఘటన బాధాకరం – సీఎం
ఉత్తమ సేవలు అందించాలని ఆదేశించాం
అమరావతి – అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో చోటు చేసుకున్న ఫార్మా కంపెనీకి సంబంధించి పేలుడు ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.
ఈ సందర్బంగా గురువారం మీడియాతో మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఇప్పటి వరకు పేలుడు కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారని , 36 మందికి గాయాలు అయ్యాయని తెలిపారు.
ఇందులో 10 మందికి తీవ్రంగా గాయాలు కాగా , 26 మందికి స్వల్పంగా గాయాలైనట్లు స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించామని సీఎం చెప్పారు.
ఇప్పటి వరకు మృతి చెందిన వారి కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ. ఒక కోటి చెప్పొన ఎక్స్ గ్రేషియా ప్రకటించామన్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారని తెలిపారు.
తీవ్ర గాయాలైన వారికి రూ. 50 లక్షలు చొప్పున, స్వల్పంగా గాయాలైన వారికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు నారా చంద్రబాబు నాయుడు. బాధితులకు ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు సీఎం.