దర్బార్ కృష్ణుడి అలంకారంలో
హైదరాబాద్ – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. స్వామి వారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆలయ ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.