NEWSTELANGANA

హైద‌రాబాద్ లో ష్వాబ్ టెక్నాల‌జీ సెంట‌ర్

Share it with your family & friends

తెలంగాణ ప్ర‌భుత్వంతో చార్లెస్ ఒప్పందం

అమెరికా – యుఎస్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయ‌న ప్ర‌ముఖ కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత దేశంలోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం.

కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్ , రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్ కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.