పొంగులేటి కొడుకుకు సమన్లు
లగ్జరీ వాచ్ స్మగ్లింగ్ కేసులో షాక్
హైదరాబాద్ – రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన తనయుడు పొంగులేటి హర్ష రెడ్డికి అత్యాధునిక గడియారాలను స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలపై చెన్నై కస్టమ్స్ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ విషయం రాష్ట్రంలో చర్చ నీయాంశంగా మారింది.
గత ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి వచ్చిన ఓ భారతీయుడి నుంచి రూ. 1.73 కోట్లు విలువైన లగ్జరీ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థలో డైరెక్టర్ గా ఉన్న హర్ష రెడ్డి ఏప్రిల్ 4న కష్టమ్స్ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే డెంగ్యూ జ్వరం వచ్చిందని , దీని కారణంగా వాయిదా వేయాలని కోరారు. ఏప్రిల్ 27 తర్వాత హాజరు కావడానికి కస్టమ్స్ శాఖ అంగీకరించింది.
ఇదిలా ఉండగా క్రిప్టో కరెన్సీ , హవాలా ద్వారా లావాదేవీలు జరిపి డీల్ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ కుమార్ అనే మధ్యవర్తి ద్వారా హర్ష రెడ్డి ముబీన్ అనే వ్యక్తి నుండి వాచీలను తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని, తన ప్రమేయం ఎంత మాత్రం లేదని పేర్కొన్నారు హర్ష రెడ్డి. ముబీన్ నుండి స్వాధీనం చేసుకున్న రెండు గడియారాలలో ఒకటి ఫిలిప్ 5740, బ్రెగ్యుట్ 2759 ఉన్నాయి.