నటి కస్తూరికి షాక్ 29 వరకు రిమాండ్
ఎగ్మోర్ కోర్ట్ లో హాజరు పర్చిన పోలీసులు
తమిళనాడు – తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కనిపించకుండా పోయిన నటి కస్తూరిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడి నుంచి నేరుగా చెన్నైకి భారీ బందోబస్తు మధ్య తరలించారు. నటి కస్తూరిని చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో హజారు పరిచారు. కోర్టు ఆమెకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో నటి కస్తూరి శంకర్ ను జైలుకు తరలించారు.
తెలుగు వారు తమిళులకు బానిసలంటూ సంచలన , అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆపై తాను అన్న మాటలకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ప్రకటించారు. ఆపై నటి కస్తూరి పై దేశ వ్యాప్తంగా తెలుగు వారితో పాటు ఇతరులు కూడా మండిపడ్డారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.
దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో నటి కస్తూరి శంకర్ దిగి వచ్చారు. తాను అలా అనలేదని, ఎవరినైనా కించ పర్చినట్లు భావిస్తే తనను మన్నించాలని కోరారు. మరో వైపు తమిళనాడు రాష్ట్రంలో పలు చోట్ల నివసిస్తున్న తెలుగు వారు నటి కస్తూరిపై ఫిర్యాదు చేయడంతో పలు చోట్ల ఆమెపై కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్నా కోర్టులో చుక్కెదురైంది.