దాడుల సంస్కృతి నాది కాదు
హుందా రాజకీయాలే నా నైజం
చిత్తూరు జిల్లా – చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకరిపై దాడులు చేయించే నీచ మనస్తత్వం తనది కాదన్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు తను ఏమిటో, తన వ్యక్తిత్వం ఏమిటో అని పేర్కొన్నారు. ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారో అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ నేత పులిపర్తి నానితో పాటు ఆయన భార్య నోరు జారినా ఇప్పటి వరకు తాను వారి గురించి చులకనగా మాట్లాడ లేదన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
పులిపర్తి నానిని తన రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప శత్రువుగా ఏనాడూ భావించ లేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. దాడులకు పాల్పడడం, మర్డర్లు చేయడం, ఇబ్బందులు పెట్టడం తమ సంస్కృతి కాదని మరోసారి స్పష్టం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.