స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ – సీఎం
దేశ క్రీడా రంగానికి రాష్ట్రం కేరాఫ్
హైదరాబాద్ – దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోర్త్ సిటిలో భాగంగా తల పెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఉన్నతాధికారులతో చర్చించారు.
రకరకాల క్రీడలు, అకాడమీలు, పాఠశాలలు, క్రీడా శిక్షణా సంస్థలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తేవడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రూపుదిద్దు కోవాలని ఆదేశించారు.
దశాబ్దాల కిందటే ఆఫ్రో-ఏసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ భవిష్యత్తులో ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి కోరారు.
ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా మన క్రీడాకారులు పతకాలను దక్కించుకునేలా వర్సిటీని తీర్చిదిద్దాలని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిపుణులైన శిక్షకులతో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు.
మన దేశం నుంచి ఒలింపిక్స్‌లో రాణించే షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, అర్చరీ, జావెలిన్ త్రో, హాకీకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత శిక్షణ ద్వారా పతకాలు సాధించే అవకాశాలు ఉన్న మిగతా క్రీడల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు.
చిన్న తనంలోనే విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను ఉపాధ్యాయలు గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి విద్యార్థులందరికీ ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేలా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ పాఠశాలల్లో విద్యా బోధనతో పాటు క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా శిక్షణ ఇప్పించాలన్నారు.
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన దేశాలు, క్రీడాకారుల వివరాలను సేకరించి, క్రీడాకారులు శ్రమించిన తీరు, క్రీడల పట్ల ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
యంగ్ ఇండియాకు తెలంగాణ ఒక బ్రాండ్ గా మారాలని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టిన తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా యంగ్ ఇండియా పేరును ఖరారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.