దాతలు స్పందించండి విరాళాలు ఇవ్వండి
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజీ
హైదరాబాద్ – భారీగా కురిసిన వర్షాల తాకిడికి ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ప్రధానంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాలు నీళ్లల్లో చిక్కుకున్నాయి.
పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మానవతా దృక్ఫథంతో బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని భక్తులను కోరారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజీ.
సామాజిక మాధ్యమాల వేదికగా స్వామి వారు కీలక ప్రకటన చేశారు. జీవా ఆధ్వర్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా వరద బాధితులను ఆదుకునేందుకు అందరూ ఒక్కతాటి పైకి వచ్చి సాయం చేయాలని సూచించారు .
వికాస తరంగిణి ఆధ్వర్యంలో వాలంటీర్లు సహాయ పడుతున్నారని తెలిపారు . వరదల కారణంగా విజయవాడ, ఖమ్మంలలో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు భరోసా కల్పించడం, ఆహారం, స్వచ్ఛమైన నీరు , వైద్య సంరక్షణ వంటి కీలకమైన సహాయాన్ని అంద జేస్తున్నట్లు తెలిపారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజీ. కనీసం రూ. 10 వేల చొప్పున తోచినంత వరద బాధితుల కోసం సాయం చేయాలని సూచించారు.