మోడీ ఆలింగనం చిరంజీవి భావోద్వేగం
ప్రధానమంత్రి మోదీతో అనుబంధం
హైదరాబాద్ – మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. ఏపీ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సభా వేదికపై తమ్ముడు పవన్ కళ్యాణ్ తన కాళ్లకు నమస్కరించడం, పీఎంతో ముచ్చటించడం తనను మరింత సంతోషానికి లోను చేసిందని పేర్కొన్నారు చిరంజీవి.
గురువారం ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రధాని మోడీతో కలిసి పవన్ తన వద్దకు రావడం, మా ఇద్దరితో కలిసి ప్రజలకు అభివాదం చేయడం తనను మరింత సంతోషాన్ని కలిగించేలా చేసిందని తెలిపారు.
ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయని ప్రధాని తమతో చెప్పడంతో జన్మ ధన్యమైందని పేర్కొన్నారు.