ఎస్పీ మణికంఠ చందోలు కితాబు
చిత్తూరు జిల్లా – విశిష్ట సేవలు అందించిన జెన్నీ పోలీస్ శునకానికి ఘనంగా వీడ్కోలు పలికారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. సాయుధ దళం కార్యాలయంలో పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. 11 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో సేవలు అందించింది. పోలీసు విధుల్లో జెన్నీ చేసిన సేవలు అద్భుతమన్నారు ఎస్పీ. శునకానికి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. పలు కేసుల్లో జెన్నీ సహకారం మరువ లేనిదన్నారు.
ఈ శునకం నవంబర్ 15, 2013న పుట్టింది. ఇది గోల్డెన్ రిట్రైవర్ జాతికి చెందినది. హైదరాబాద్ లోని మొయినాబాద్ లో ఎక్స్ ప్లోజివ్ విభాగంలో 8 నెలల పాటు కఠిన శిక్షణ తీసుకుందన్నారు.
జెన్నీ VIP , VVIP కార్యక్రమాల యందు మెరుగ్గా సేవలు అందించిందన్నారు. ముఖ్యమైన దేవాలయాలు అయిన కాణిపాకం, తిరుమలలోని బ్రహ్మొత్సవాలు, గోదావరి పుష్కరాల సమయాలలో సంఘ విద్రోహ చర్యల నివారణ కొరకు దీని సేవలు ఉపయోగించడం జరిగిందన్నారు ఎస్పీ మణికంఠ చందోలు. పలు కీలకమైన కేసులలో జెన్నీ అందించిన సహకారం మరిచి పోలేమన్నారు.
అంతేకాకుండా పోలీసు విధులలో భాగమైన ఎన్నికలలో చురుగ్గా పాల్గొందన్నారు. తన అనుగుణమైన శైలితో ఉన్నతమైన సేవలు పోలీసు డిపార్టుమెంటుకు అందించిందని కొనియాడారు ఎస్పీ. ప్రపంచ నౌకాదళ రోజు సందర్బముగా వైజాగ్ లో నిర్వహించిన ASC విధులు నందు జెన్నీ తన ప్రతిభను కనబరిచిందన్నారు.