అభినందించిన సీఎస్ కె. విజయ కుమార్
అమరావతి – 2024వ సంవత్సరంలో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించినందుకు గాను “ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారం” అందుకున్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు.
15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎస్ విజయ కుమార్ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఎస్పీ చేసిన సేవలు ప్రశంసనీయమని, బాధ్యతాయుతంగా వ్యవహరించి పేరు తీసుకు రావాలని కోరారు సీఎస్.
ఇదిలా ఉండగా చిత్తూరు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషించారు ఎస్పీ మణికంఠ చందోలు. ప్రత్యేకించి ప్రజలలో ఉన్న భయాందోళనలను చెరిపి వేశారు. బాధితులకు అండగా ఎస్పీ కార్యాలయంలో నూతనంగా కౌన్సెలింగ్ సెంటర్ ను నెలకొల్పారు.
పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా యువత చెడిపోకుండా ఉండేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఇదే సమయంలో ఓటు విలువ గురించి తెలియ చేస్తున్నారు. రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఎన్నికల్లో ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలు కాపాడారు మణికంఠ చందోలు.