జార్ఖండ్ ముక్తి మోర్చాకు చంపై సోరేన్ రిజైన్
తాను ఇక ఉండలేనంటూ మాజీ సీఎం ప్రకటన
జార్ఖండ్ – జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ పరంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జార్ఖండ్ ముక్తీ మోర్చా సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరేన్ తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన గత కొంత కాలంగా ప్రస్తుత సీఎం హేమంత్ సోరేన్ పై అసంతృప్తితో ఉన్నారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు. తాను గత్యంతరం లేక పార్టీని వీడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇన్నేళ్ల పాటు ఆదరించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
జార్ఖండ్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో తన వంతు పాత్ర పోషించానని, పేదలు, సామాన్యులు, అభాగ్యులు, అన్నార్థులు, నిరుద్యోగుల కోసం తాను పోరాడానని స్పష్టం చేశారు చంపై సోరేన్. తనను ప్రజా ప్రతినిధిగా, చివరకు ముఖ్యమంత్రి అయ్యేందుకు మీరంతా కారకులయ్యారని కానీ అనుకోకుండా తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు మాజీ సీఎం.
పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేశానని, కష్ట కాలంలో తాను అండగా ఉన్నానని, కానీ తన పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడంతో చివరకు గత్యంతరం లేక పార్టీని వీడాల్సి వస్తోందని తెలిపారు చంపై సోరేన్. త్వరలోనే తాను భవిష్యత్తు నిర్ణయం ప్రకటించ బోతున్నట్లు ప్రకటించారు .