సీజేఐ చంద్రచూడ్ సంచలన నిర్ణయం
న్యాయ దేవత కళ్లకు గంతలు తొలగింపు
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐగా తన పదవీ కాలంలో న్యాయ వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు.
తాజాగా న్యాయ దేవత కళ్లకు కట్టిన కట్టు తొలగించాలని ఆదేశించారు. ఇది భారత దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం అని చెప్పక తప్పదు. అంతే కాదు న్యాయ దేవత చేతిలో ఉన్న కత్తికి బదులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంచాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల గ్రంధాలయంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో చట్టం గుడ్డిది కాదని, శిక్షకు ప్రతీకగా లేదని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.
భారతదేశం బ్రిటిష్ వారసత్వం నుండి ముందుకు సాగాలని, చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదని, అది అందరినీ సమానంగా చూస్తుందని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల ప్రకారం న్యాయాన్ని అందజేస్తాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.