సీజేఐ సూచనలతో దిగి వచ్చిన వైద్యులు
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా కోల్ కతాలో చోటు చేసుకున్న ట్రైనీ డాక్టర్ రేప్ , మర్డర్ కేసుకు సంబంధించి భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు వైద్యులు. దీంతో అత్యవసర వైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ కేసుకు సంబంధించి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేసింది సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.
30 ఏళ్ల కాలంలో ఇలాంటి కేసును తాము ఎన్నడూ చూడలేదంటూ ఆసక్తికరవైన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్ లో కొలువు తీరిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఎండగట్టింది. ఈ సందర్బంగా సీరియస్ కామెంట్స్ చేశారు సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్.
నిరసన తెలపడం, సమ్మె చేయడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇదే సమయంలో పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో కీలక ప్రకటన చేశారు సీజేఐ. గత కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మెను వైద్యులు విరమించాలని, మానవతా దృక్ఫంతో అర్థం చేసుకుని సహకరించాలని సూచించారు. సీజేఐ సూచన మేరకు వైద్యులు దిగి వచ్చారు. తాము ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు.