మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రముఖ వీసాల దేవుడిగా పేరు పొందిన రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై రామరాజ్యం సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హిందువులకు రక్షణగా ఉంటామని ప్రకటించే భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు మెల మెల్లగా స్పందించడం మొదలు పెట్టాయి.
ఘటన తెలిసిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల స్పందించారు. దాడి వెనుక ఎవరు ఉన్నారనే దానిపై ఆరా తీయాలని, ఈ ఘటనపై విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆలయాల పరిరక్షణే ధ్యేయంగా గత కొంత కాలంగా పోరాటం చేస్తూ వస్తున్నారు రంగరాజన్ అని కొనియాడారు.
దీంతో పరిస్థితి రాజకీయం కావడంతో వెంటనే రంగంలోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం నేరుగా రంగరాజన్ తో ఫోన్ లో మాట్లాడారు. మీజోలికి ఎవరూ రారని, కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. తాను కూడా ప్రభుత్వం రాక ముందు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చిలుకూరు ఆలయం నుంచే పాదయాత్ర ప్రారంభించానని ఈ సందర్బంగా గుర్తు చేశారు.