వరుసగా ఢిల్లీకి 37వ సారి
ఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన సీఎంగా కొలువు తీరిన తర్వాత ఇప్పటి వరకు 37 సార్లు ఢిల్లీకి వెళ్లారు. గతంలో ఏ సీఎం ఇలా వెళ్లిన దాఖలాలు లేవు. నిన్న కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో కలిసన సీఎం ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో భేటీ కానున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, పలు అభివృద్ది పనులపై చర్చించనున్నారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు ఫేస్2, రీజనల్ రింగ్, రోడ్, రీజినల్ రింగ్ రైల్వే వంటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరనున్నారు.
ఇదే సమయంలో ఏఐసీసీ హై కమాండ్ తో కూడా కలవనున్నారని సమాచారం. ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు చర్చించనున్నారు. ఎవరికి సీట్లు ఇవ్వాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇది సీఎంకు తలనొప్పిగా మారింది. మరో వైపు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దూకుడు పెంచారు. తన పనితీరుకు పదును పెట్టారు.
వచ్చీ రాగానే కాంగ్రెస్ పెద్దలకు ఝలక్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఆమె ఎవరూ ఊహించని విధంగా పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై వేటు వేశారు. సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశించారు.