చంద్రబోస్ పాటలు అద్భుతం – సీఎం
ఆస్కార్ అవార్డు దక్కడం సంతోషం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు పురస్కార గ్రహీత చంద్రబోస్. తెలంగాణ ప్రాంతానికి చెందిన చంద్రబోస్ తెలుగు సినీ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నారు.
సచివాలయంలో తనను కలిసిన చంద్రబోస్ ను అభినందనలతో ముంచెత్తారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తాను కూడా పాటలు వింటానని, పుస్తకాలు చదువుతానని ఈ సందర్బంగా తెలిపారు. సాహిత్యానికి ప్రాణం పోస్తూ అద్భుతమైన పాటలు రాయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబోస్ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాటలు రాయాలని, తెలంగాణ ప్రాంతానికి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు ఎ. రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా డైనమిక్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా నాటు నాటు అంటూ పాట రాశారు చంద్రబోస్. ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా జనాదరణ పొందింది. చివరకు అత్యున్నతమైన ఆస్కార్ పురస్కారానికి ఎంపికైంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పౌర సరఫరాలు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చంద్రబోస్ ను శాలువాతో సత్కరించి..జ్ఞాపికను అందజేశారు.