ఆర్జీవీ..ప్రభాస్ దమ్మున్నోళ్లు – సీఎం
క్షత్రియులు ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలి
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. క్షత్రియులు సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా ఆయన తెలుగు సినిమా రంగానికి సంబంధించి కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన పేరు ఎత్తకుండా ఉండలేమన్నారు.
తాను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసే వాడినని చెప్పారు సీఎం. ఇదే సమయంలో దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అభినందించారు. ఆయన దమ్మున్న డైరెక్టర్ అంటూ కితాబు ఇచ్చారు. ఇదే సమయంలో హాలీవుడ్ రేంజ్ లో నటిస్తున్న గొప్ప నటుడు ప్రభాస్ అంటూ ప్రశంసించారు ఎ.రేవంత్ రెడ్డి.
టాలీవుడ్ లో శివ సెన్సేషన్ అని, బాలీవుడ్ కు వెళ్లి అక్కడ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఘనత రామ్ గోపాల్ వర్మకు దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టాలని క్షత్రియులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు, వారికి పూర్తి ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో అన్ని రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఉందని అన్నారు సీఎం. క్షత్రియులను శాసన సభల్లోకి తీసుకోవాలని అనుకున్నామని చెప్పారు. పార్టీలో ముందుగా వారికే అవకాశం కల్పిస్తామని అన్నారు సీఎం.