బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి
ఢిల్లీ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో తనను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని కోరుతూ రెండు బిల్లులను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం, వాటికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం డేర్ స్టెప్ తీసుకుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి. దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతున్నా ఇంకా అణగారిన వర్గాలు తీవ్ర వివక్షకు లోనవుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం కూడా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తాము తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి తమ వంతు సపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అఖిలపక్ష నాయకులతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.