త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ – సీఎం
తెలంగాణ నేలపై గొప్ప యోధుడు
హైదరాబాద్ – ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగశీలి అని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. శుక్రవారం ఆచార్య జయంతి సందర్బంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సీఎం.
ఆయన గొప్ప యోధుడని, స్వాతంత్ర కాలం నాటి నుంచి పేదల పక్షాన నిలిచిన అరుదైన వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు ఎ. రేవంత్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు వివేక్, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి పాల్గొన్నారు.
కాగా కొండా లక్ష్మణ్ బాపూజీ స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి. ఆయన సెప్టెంబర్ 27, 1915లో పుట్టారు. 96 ఏళ్ల వయసులో కాలం చేశారు. ఆయన ఉన్న నివాసం జల దృశ్యం తెలంగాణ మలి దశ ఉద్యమానికి వేదికగా మారింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడారు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. గాంధీ స్పూర్తితో 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అంతే కాదు 1947-48లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా కూడా యుద్ధం చేశాడు.
1952 నాన్-ముల్కీ ఆందోళనలో పాల్గొన్నారు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969 మార్చి 29న తెలంగాణా కోసం తన పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి మంత్రి కావడం విశేషం.
1952లో తొలిసారిగా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1957లో చిన్న కొండూరు (భువనగిరి) నియోజకవర్గం నుండి గెలుపొందారు. 1957 నుండి 1960 వరకు డిప్యూటీ స్పీకర్‌గా, భోంగీర్ అసెంబ్లీ నియోజకవర్గం (1967-72, 1972-78) నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా (1967-69) పనిచేశాడు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించడం పట్ల అసంతృప్తితో 1987లో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోయడంలో కీలక పాత్ర పోషించారు.