మంగళగిరి ఎయిమ్స్ కు 10 ఎకరాలు
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ముతో పాటు సీఎం పాల్గొన్నారు. ఎయిమ్స్ కు 10 ఎకరాల స్థలాన్ని తక్షణమే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
తొలి స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించగలం అనేందుకు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఉదాహరణ అన్నారు. ప్రపంచంలోనే అమరావతి రాజధాని ఒక అద్భుత నగరంగా ఎదగబోతోందని చెప్పారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ గర్వకారణం అన్నారు నారా చంద్రబాబు నాయుడు. సామాన్య కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము నేడు దేశానికే ప్రథమ పౌరురాలయ్యారని కొనియాడారు.
మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదుగుతుందన్నారు. 2018లో మంగళగిరి ఎయిమ్స్ కు మేమే శంకుస్థాపన చేశామని చెప్పారు సీఎం. ఎయిమ్స్ లో రూ.10 లకే వైద్య సేవలు అందించడం జరుగుతోందని అన్నారు.
ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్ విధానాలు పాటిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 12 యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలో ఐఐఎం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, కాకినాడలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్, తాడేపల్లిగూడెంలో నిట్, విజయవాడలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, తిరుపతిలో ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఐజర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్), కర్నూలులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్, అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ఆమోదం తెలిపిందన్నారు.