వెనక్కి తీసుకోవాలని అమిత్ షా ఆదేశం
అమరావతి – టీటీడీలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయ్యింది. ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నట్లు లేఖ రాసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో తిరుమల వ్యవహారాలపై జోక్యం చేసుకోవద్దంటూ కేంద్ర హోం శాఖను ఆదేశించారు అమిత్ షా.
దీంతో టీటీడీ అధికారులతో హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల టీటీడీ లో చోటు చేసుకున్న తొక్కిసలాట వ్యవహారంలో మొదటిసారి జోక్యం చేసుకుంది కేంద్ర హోం శాఖ. ఈ నెల 20 వ తేదీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లారు. గతంలో ఏనాడూ టీటీడీపై కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకున్న దాఖలాలు లేవన్నారు. పైగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు. ఈ తరుణంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందంటూ సీఎం అమిత్ షాకు వివరించారు.